Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ‘వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తుండడంపై నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని అడ్డగోలు కుట్రలకు తెరలేపినా, విద్యాధికులు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పారనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఏడో తరగతి ఫెయిల్ అయినవారికి సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం పెను రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే.
వైసీపీ పెయిడ్ ఓటర్లు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఎలాగైతే దాష్టీకం ప్రదర్శించారో, అదే తీరున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హల్‌చల్ చేయడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమైంది. అయితే, వైసీపీ పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత వుండడంతో, వైసీపీ తాయిలాలు ఎక్కడా పనిచేసినట్లు కనిపించడంలేదు.
స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో ఎలాగూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ వుంటుంది. కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిఖార్సయిన ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు ఫలితమే ఈ నిదర్శనం..’ అంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల విషయమై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోపక్క, ఈ ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తుండడంతో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అదే సమయంలో, ‘బైబై వైఎస్ జగన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.