BalaKrishna: ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది 50ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. సెప్టెంబర్ 1న జరిపే వేడుక వివరాలను తెలిపే క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్వహించారు. ఈక్రమంలో స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఆవిష్కరించారు.
నందమూరి మోహనకృష్ణ.. ‘‘తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుతో నాన్నగారికి వారసుడిగా సినిమాలు, రాజకీయాల్లో ఉన్నార’’ని అన్నారు.
దర్శకుడు కోదండరామిరెడ్డి.. ‘‘బాలయ్యతో ఎక్కువగా 13సినిమాలు చేసా. చాలా మంచివారు. తండ్రిలానే దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. 50ఏళ్లు హీరోగా ఉండడం గొప్ప విషయం. ఈమధ్య జై బాలయ్య ఎక్కువగా వినిపిస్తోంద’’ని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ.. ‘‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కుర్రహీరోలకు పోటీనిస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడ’ని అన్నారు.
కార్యక్రమంలో.. పరుచూరి గోపాలకృష్ణ, సి.కిరణ్, వైవీఎస్ చౌదరి, బోయపాటి శ్రీను, ప్రసన్న కుమార్, దామోదర ప్రసాద్ మా అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు, వేడుకను ఘనంగా నిర్వహిస్తామని.. అన్ని పరిశ్రమలవారినీ ఆహ్వానిస్తున్నామని అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు.