BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే విషయం తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం కూడా డిసెంబర్ 5 (నేడు) పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. నేడు ఆ వేడుక జరగలేదు. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ చెప్పిన నెరేషన్ నచ్చకే క్యాన్సిల్ చేశారంటూ వార్తలు వచ్చాయి.
అయితే.. కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞ సినిమా నేడు ప్రారంభం కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం వైరల్ జ్వారాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ జ్వరం పడ్డాడు. దీంతో షూటింగ్ ప్రారంభం మరో రోజుకి వాయిదా వేశాం. ఎప్పుడు సినిమా ప్రారంభమైనా ప్రేక్షకుల ఆశీస్సులు, అభిమానుల ఆదరణ మోక్షజ్ఞకు ఉంటుంద’ని అన్నారు. దీంతో గాసిప్స్ కు చెక్ పెట్టినట్టయింది.