ఇటివల వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తాను చేసిన ‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. తాను అక్కినేని నాగేశ్వరరావుపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అక్కినేని తనకు ఎప్పటికీ బాబాయేనని అన్నారు. అవి యాధృచ్ఛికంగా వచ్చిన వ్యాఖ్యలే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అన్నారు. ఆయన సొంత పిల్లలకంటే తనను అభిమానంగా చూసేవారని అన్నారు.
‘ఒక్కో యాసలో ఒక్కో పిలుపు ఉంటుంది. నేను వెళ్తున్నా నన్ను కూడా అభిమానంగా ఒక్కోరకంగా పిలుస్తూంటారు. నాగేశ్వరరావుగారు అంటే నాకు ఎంతో అభిమానం. ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లు. వారి నుంచి రెండు విషయాలు నేర్చుకున్నాను. మొదటిది నాన్నగారి నుంచి క్రమశిక్షణ.. రెండోది నాగేశ్వరరావుగారి దగ్గర నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలని నేర్చుకున్నాను. మూడోది చెప్పాలంటే.. ఎన్టీఆర్ పరమపదించిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ జాతీయ అవార్డును మొదటగా అక్కినేని నాగేశ్వరరావు గారికే ఇచ్చాము. ఆయనపై ప్రేమ నా గుండెల్లో ఉంది’ అని బాలకృష్ణ అన్నారు.