నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్ ఇచ్చారు. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో ఈ విషయాన్ని రివీల్ చేశారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ప్రకటించారు. అయితే.. మోక్షజ్ఞను లాంచ్ చేయబోయే డైరక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. బోయపాటి శీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అనే ప్రశ్నకు మాత్రం ‘అంతా దైవేచ్ఛ’ అని సమాధానమిస్తూ నవ్వారు.
గోవా ఫిలిం ఫెస్టివల్లో అఖండ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇదే వేదికపై అఖండ-2 విషయాన్ని ప్రస్తావించారు. అఖండ-2 ఖచ్చితంగా ఉంటుందని.. కథ కూడా సిద్ధమైందని.. ప్రకటనే ఆలస్యమని అన్నారు. సరైన సమయం చూసి ప్రకటిస్తాం అని అన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న వీరసింహారెడ్డి సంక్రాంతికి రానుంది.