Bala Krishna: సినిమాలు.. ప్రజల గుండెల్లో ఆదరణ.. రాజకీయంగా అత్యున్నత స్థాయి.. కుటుంబ గౌరవం. ఇవన్నీ సాధించిన లెజండరీ నందమూరి తారక రామారావు తనయుడు సినిమాల్లోకి ఆయన వారసుడిగా వస్తున్నాడంటే అంచనాలు ఆషామాషీగా ఉండవు. అలా వచ్చి బాక్సాఫీస్ బోనాంజా నుంచి యువరత్న.. ఆ తర్వాత నటసింహంగా తెలుగు తెరపై ప్రజ్వరిల్లిన ఆ హీరోనే నందమూరి బాలకృష్ణ. తండ్రి అడుగుజాడల్లోనే సినిమా తెరంగేట్రం చేసినా తనకంటూ ఓ గుర్తింపు.. అశేష ప్రేక్షకుల్ని అలరించి.. అభిమానం సంపాదించి తెలుగు తెరపై రాణించారు. ఎన్టీఆర్ కు కుటుంబ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణం. కెరీర్ మొదట్లో బాలకృష్ణ అదే ఆదరణ సంపాదించారు. తర్వాత మాస్ సినిమాలతో తన పంధా చూపారు. మీసం మెలేసి.. తొడ కొడితే బాక్సాఫీస్ నేటికీ దద్దరిల్లాల్సిందే. బాలకృష్ణ పుట్టినరోజు నేడు.
అన్ని జోనర్స్ లో సినిమాలు..
అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య. జై బాలయ్య వారి నినాదం. ఆ పిలుపుకి బాలకృష్ణ ఇచ్చే చిరునవ్వు వారికి ఎంతో మురిపెం. చేయి గాల్లో ఊపుతూ అభివాదం చేస్తే కనుల పండుగే. కుటుంబం, జానపదం, భక్తి, మాస్.. ఇలా బాలకృష్ణ టచ్ చేయని జోనర్ తెలుగు సినిమాల్లో లేదు. ఒక రకంగా తెలుగు సినిమాల్లో చివరి జానపద హీరో బాలకృష్ణనే చెప్పాలి. భైరవద్వీపంతో నేటి జనరేషన్ కూ నచ్చే సినిమా ఇచ్చారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య సినిమాలు ట్రేడ్ మార్క్. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి.. వంటి అనేక సినిమాలతో రాజసం పలికించారు. పౌరాణికంగా శ్రీకృష్ణార్జునవిజయం సినిమాతోనూ చివరి హీరో ఆయనే. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో సీనియర్ హీరోగా తన పవర్ చూపించారు. ఇన్ని జోనర్స్ టచ్ చేసింది సీనియర్స్ లో బాలకృష్ణ మాత్రమే.
అలుపు తెలియని బాలయ్య..
సినిమాలే కాదు.. సేవా కార్యక్రమాల్లో, ప్రజాప్రతినిధిగానూ బాలకృష్ణది ప్రత్యేక శైలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేద రోగులకు వైద్య సాయం అందిస్తున్నారు. కరోనా సమయంలో పరిశ్రమ కార్మికుల కోసం ‘సీసీసీ’కి 25లక్షల సాయం చేశారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. నియోజకవర్గ అభివృద్ధికి రాజీలేని కృషి చేస్తున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు పార్టీ.. ఇంకోవైపు నియోజకవర్గ అభివృద్ధి. మూడు దశల్లోనూ బాలయ్యది అలుపెరుగని పరుగు. అందుకే బాలకృష్ణ అంటే అభిమానులకు అంత గౌరవం. ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. త్వరలో తన లక్కీ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కెరీర్లో, సేవా కార్యక్రమాల్లో, ప్రజా ప్రతినిధిగా బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.