దర్శకుడు ఎస్‌జే శివ దర్శకత్వంలో కమెడియన్ ప్రవీణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడ రామ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు.
దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, “బకాసుర రెస్టారెంట్ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇప్పటి వరకు తెలుగులో చూడని కొత్త జానర్ ఇది. యమలీల, ఘటోత్కచుడు సినిమాల తరహాలో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతి కలిగించే కథ. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఎలా ఉంటుందో చూపించే కథ ఇది. హారర్, కామెడీ, ఎమోషన్ అన్నీ మిక్స్ అయిన ప్యాకేజ్ ఇది” అని తెలిపారు.
హీరోగా ప్రవీణ్ ఎంపికపై శివ మాట్లాడుతూ, “మొదట ఇతర హీరోలతో చర్చించాం. కానీ వాళ్లందరూ సోలో హీరో సినిమాలకే ఆసక్తి చూపారు. అప్పుడు ప్రవీణ్‌ను కలిశాం. ఈ కథ విన్న వెంటనే ఆయనే ఈ సినిమా చేయాలని ఒప్పుకున్నారు. ఇది ఐదుగురు బ్యాచిలర్ల కామెడీ స్టోరీ” అన్నారు.
తన బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుతూ శివ, “నేను లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివాను. విరూపాక్ష చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. మా నాన్న సినిమాలు నిర్మించారు. ఆయన కోరిక నెరవేర్చడానికే నేను దర్శకుడిగా మారాను” అని చెప్పారు.
దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు. “శిరీష్ గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ఎస్వీసీ వంటి పెద్ద సంస్థ మా సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది” అన్నారు.
బడ్జెట్ గురించి శివ మాట్లాడుతూ, “స్టార్స్ లేకుండా పెద్ద బడ్జెట్ ఎందుకు? అని కొందరు అడుగుతారు. కానీ మేము కథను నమ్మి సినిమా తీశాం. పెద్ద హీరోలకు ఇచ్చే పారితోషికాన్ని మేము మేకింగ్‌లో పెట్టాం. క్వాలిటీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు” అన్నారు.
“ప్రేక్షకులకు వారి బ్యాచిలర్ లైఫ్ గుర్తు చేసే కథ ఇది. హర్ష బకాసుర పాత్రలో కనిపిస్తాడు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది” అని దర్శకుడు తెలిపారు.
భవిష్యత్‌లో విఠలాచార్య స్టైల్ సినిమాలు తీయాలనే కోరిక ఉందని, ప్రస్తుతం ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. “బకాసుర రెస్టారెంట్ పార్ట్ 2 ఉండదు. ఈ కథలోనే బకాసుర పాత్ర ముగుస్తుంది” అని స్పష్టం చేశారు.
తన లక్ష్యం గురించి మాట్లాడుతూ, “చాలా తక్కువ రోజుల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం. పూరీ గారు నా ఆదర్శం. మా సినిమా 5 కోట్లతో తీసి 12 కోట్ల విలువైన అవుట్‌పుట్ చూపిస్తాం” అని శివ తెలిపారు.
