తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిందితులు రూ.3లక్షల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు నిందితులు ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసులోని నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతిపై బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్లో నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, నకిలీ పాస్ పోర్టు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. నందకుమార్ పైనా ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఫిలింనగర్ లోని డెక్కన్ కిచెన్ లీజుతోపాటు బెదిరింపుల కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఓ కేసులో గతంలోనే రిమాండ్ కు తరలించారు.