వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. వ్యక్తి గత పూచికత్తుపై ఆమెకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రగతి భవన్ ముట్టడికి దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్తూండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కారు నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించగా.. ఆమె కారులో ఉండగానే.. క్రేన్ సాయంతో కారును ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పంజాగుట్ట పీఎస్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద షర్మిలతోపాటు మరో ఐదుగురిపై ఐపీసీ 143,341, 290, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శాంతి భద్రతల దృష్ట్యా షర్మిలను రిమాండ్ కు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. షర్మిలతోపాటు మరో ఐదుగురు కార్యకర్తలకు పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసారు.