Badri: ఒక సినిమా.. ఎందరో జీవితాల్లో అత్యంత మధురం. సుదీర్ఘ ప్రస్థానంలో జ్ఞాపకాల పందిరి. ఈ ఆనందాన్ని, మధురానుభూతుల్ని పంచుకునేది.. పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్, అమీషా పటేల్, పూరి జగన్నాధ్, రమణ గోగుల.. మొత్తం టీమ్. ఇంతకీ ఆ టీమ్ ఎవరంటే.. స్టైల్, ఆటిట్యూడ్, డ్యాన్స్, ఫైట్స్ తో మిలియనమ్ 2kలో పెను సంచలనాన్ని సృష్టించిన ‘బద్రి’ టీమ్. ఎన్నిసార్లు చెప్పుకున్నా బాగుంటుంది. పవన్ కల్యాణ్ స్టైల్, డ్రెస్సింగ్, హెయిర్ స్టయిలింగ్, డైలాగ్ డిక్షన్, ఆటిట్యూడ్, పూరి జగన్నాధ్ స్టోరీ టెల్లింగ్, టేకింగ్, రమణ గోగుల మ్యూజిక్.. ఇలా ప్రతీదీ అద్భుతమే. ఈ అద్భుతానికి నేటితో 25ఏళ్లు.
‘నువ్వు నందా అయితే.. నేను బద్రి, బద్రినాధ్’ అంటూ పవన్ పేల్చిన డైలాగులకు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. తెలుగు సినిమాలో ఓ సరికొత్త మాస్ డైలాగ్ డెలివరీ యువతను ఊపేసింది. 5వరుస హిట్లతో విపరీతమైన అంచనాల మధ్య వచ్చిన పవన్ సినిమా తుపానే సృష్టించింది. పవన్ చార్మింగ్ లుక్స్ కి అమ్మాయిల్లో క్రేజ్, స్టైల్ కి యువకుల్లో ఉత్సాహం. తెలుగు సినిమాలో ఇంగ్లీష్, హిందీ పదాలతో పాట ఓ సెన్సేషన్. షాపింగ్ మాల్లో ఫైట్ కొత్త ట్రెండ్. హాస్పిటల్ దగ్గర ఫైట్, పవన్ ఆటిట్యూడ్.. కారు అద్దాలు పగలగొట్టి స్టైల్ గా నుంచోవడం చూసి యూత్ పిచ్చెక్కిపోయారు. హీరో యాడ్ ఏజెన్సీ ఓనర్. అదో కొత్త ఫీల్. కొత్త హీరోయిన్లు రేణుదేశాయ్, అమీషా పటేల్. పవన్ చార్మ్ కు సరిపోయే జోడీ, కథలో ఫ్రెష్ ఫీలింగ్, సరదాగా సాగిపోయే పాపికొండల బోటు ప్రయాణంలా ‘బద్రి’ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
పూరి జగన్నాధ్.. ఆర్జీవీ శిష్యుడు. తానో కథ రాసి పవన్ కు చెప్పాలని ఉన్నా ఎలా కలవాలో తెలీక ఫ్రెండ్ శ్యామ్ కె.నాయుడి ద్వారా చోటా కె.నాయుడిని కలిశారు. పవన్ ఫ్రెండ్ కావడంతో ముందు తనకు చెప్పమన్నారు. చోటాకు చెప్పింది ఇట్లు..శ్రావణి సుబ్రహ్మణ్యం. కథ నచ్చి పవన్ దగ్గరకు పంపితే తెల్లవారుఝాము 4కి రమ్మన్నారు.. అరగంట టైమ్ మాత్రమే ఇస్తే, 4గంటలైనా పవన్ వింటూనే ఉన్నారు. ఇంతకీ పవన్ కు పూరి చెప్పింది బద్రి కథ. నచ్చింది కానీ క్లైమాక్స్ మార్చమని పవన్ సలహా. వారం తర్వాత పవన్ ను కలిసి ఎలా మార్చినా బాగా రావట్లేదు అన్నారు. దీనికి పవన్ చెప్పిన మాట.. నాకోసం మారుస్తావేమో చూద్దామని టెస్ట్ పెట్టా. అసలుదే బాగుందని చెప్పడంతో పూరిలో ఉత్సాహం. తెరపై తాను అనుకున్నట్టు ప్రెజెంట్ చేసి ‘ఎవరీ డైరక్టర్’ అనే రేంజ్ కు వెళ్లిపోయారు.
రమణ గోగుల. ‘బద్రి’కి ముందు ‘తమ్ముడు’కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వడంతో ‘బద్రి’కీ ప్రాణం పెట్టేశారు. పాటలు మోగిపోయాయి. ఏయ్ చికిత్తా, బంగాళాఖాతంలో పాటలు, వయోలిన్ బీజీఎమ్.. ధియేటర్లో బాక్సులు బద్దలయ్యే రెస్పాన్స్. యూత్ మొత్తం పవన్ కల్యాణ్ నామజపమే. 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చిరంజీవికి ఇష్టమైన నిర్మాత కావడంతో టి.త్రివిక్రమరావుకు సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చారు పవన్. పూరిని స్టార్ డైరక్టర్ అయ్యారు, నిజజీవితంలో పవన్-రేణుదేశాయ్ ఒక్కటయ్యారు. బ్రహ్మానందం-మల్లిఖార్జునరావు కామెడీ ట్రాక్ లో నాటి సీఎం చంద్రబాబును చూపిస్తారు. 25ఏళ్ల తర్వాత ఇప్పుడూ చంద్రబాబు సీఎం. తన క్యాబినెట్ లోనే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం. నేడు చంద్రబాబు 75వ పుట్టినరోజు కూడా. ఎలా చూసినా ‘బద్రి’ అందమైన జ్ఞాపకం. టీమ్ కి ఈరోజు పండగ. ఎందరికో ‘జ్ఞాపకాల పందిరి’.




