తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా? చంద్రబాబు భజనపరుల్లో ఈయన ఒకరు. తమ అధినేతపై ఈగ వాలనివ్వరు. టీవీ చర్చల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఈయన హల్ చల్ చేశారు. ఈనెల 24న ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు శనివారం ఏర్పాట్లు చేస్తుండగా.. బాబూ రాజేంద్ర ప్రసాద్ అక్కడకు వచ్చారు. తమ అనుమతి లేకుండా అక్కడ సదస్సు ఎలా నిర్వహిస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు.
ప్రజావేదికను ఉపయోగించుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారని, దానిపై తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఇలా ఖాళీ చేయించడం తగదని వాదించారు. అయితే, రాజేంద్రప్రసాద్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనం అని, గతంలో అక్కడ కలెక్టర్ల సదస్సు నిర్వహించేవారని, అదే తరహాలో ఇప్పుడు కూడా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్లు ఏవీ బయట పడేయలేదని, తాము కేవలం సదస్సు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి సానుభూతి పొందాలనే కారణంతోనే బాబూ రాజేంద్రప్రసాద్ ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఖాళీ చేయకుండా, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం మరొకటి ఉండదంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయడం ఆ పార్టీ కనీస బాధ్యత అని, అలా చేయకుండా ప్రభుత్వ అధికారులనే బెదిరించడం ఏమిటని అంటున్నారు.
ఇందుకు బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పే కారణం ఒక్కటే. తమ నాయకుడు ఆ ప్రజావేదికను తనకు కేటాయించమని కోరారని, దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వని నేపథ్యంలో, సర్కారు నుంచి జవాబు వచ్చేవరకు తాము అక్కడే ఉంటామని వాదిస్తున్నారు. ప్రజావేదికలో తమ నాయకుడు చంద్రబాబు ఛాంబర్ ఉందని, అందులో బోలెడు విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయని, అవి పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తాము లేని సమయంలో అక్రమంగా లోపలకు వచ్చిన ప్రభుత్వంపై దొంగతనం కేసు పెడతానని ఆయన హెచ్చరించడం కొసమెరుపు. బాబూ రాజేంద్ర ప్రసాద్ వైఖరి చూసిన పాత్రికేయులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ఇంత అడ్డంగా వాదిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.