ఒకప్పుడు.. అంటే, స్వర్గీయ నందమూరి తారకరామరావు తన అల్లుడు చంద్రబాబు కారణంగా రాజకీయ వెన్నుపోటుకి గురైనప్పుడు.. వెన్నుపోటు రాజకీయం గురించి బోల్డంత చర్చ జరిగింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెన్నపోటు రాజకీయం’ గురించి ఎప్పటికప్పుడు రాజకీయాల్లో చర్చ జరుగుతూనే వుంటుంది.
ఆ వెన్నుపోటు రాజకీయాన్ని మించిపోయింది గుండె పోటు రాజకీయం.! వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే, తొలుత గుండె పోటుగా ప్రచారం చేసింది వైసీపీ. ఆ తర్వాత అది హత్యగా తేలింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె గనుక గట్టిగా నిలబడి వుండకపోతే, తెలుగునాట వైఎస్ వివేకానందరెడ్డి.. అత్యంత కిరాతక హత్యకు గురైనాగానీ, అది గుండెపోటుగానే మిగిలిపోయేది.
న్యాయం కోసం ఆమె ఇప్పటికీ ఒంటరిపోరాటం చేస్తున్నారు. సీబీఐ విచారణ కొన‘సాగు’తూనే వుంది. అప్పటికీ, ఇప్పటికీ ఆ కేసులో కొత్తగా వెలుగు చూసిన విషయాలేమీ లేవు. అసలు ఈ డెత్ మిస్టరీ ఇప్పట్లో వీడుతుందో లేదో తెలియదు కూడా.!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పిన్నిని చంపింది ఎవరు.?’ అనే ప్రశ్న వైరల్ అయ్యింది. నారా లోకేష్, తన పిన్ని ఉమామహేశ్వరి (స్వర్గీయ ఎన్టీయార్ చిన్న కుమార్తె) మరణానికి కారకుడంటూ వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. చంద్రబాబే ఆమెను వంచించారనీ, తండ్రీ.. కొడుకు.. కలిసి ఉమామహేశ్వరి చావుకి కారణమయ్యారన్నది వైసీపీ ఆరోపణ.
బాబాయ్‌ని చంపిందెవరు.? అన్న ప్రశ్నలాగానే పిన్నిని చంపిందెవరు.? అన్న ప్రశ్న కూడా వైరల్ అవుతోంది. కొన్నాళ్ళపాటు ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
అయితే, ఆంధ్రప్రదేశ్ పరువు జాతీయ స్థాయిలో బజార్న పడుతోంది ఈ వైరల్ ప్రశ్నల వల్ల. బాబాయ్‌ని ఎవరు చంపారో తెలియదు, పిన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు.! నిజానికి, కొన్నాళ్ళ క్రితం మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా అనుమానాస్పద స్థితిలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ ఘటనపైనా ఇప్పటికీ నిజాలు నిగ్గు తేలలేదు.
ఇవింతే.! వీటి వ్యవహారం ఇంతే.