వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న టీడీపీ కార్యాలయ సిబ్బందిని ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే వుంటాయి.
‘అభిమానస్తులకు బాధ కలిగింది.. మన మీద అభిమానం పెంచుకున్నవాళ్ళు.. వారంతా. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే, వారికి కోపమొస్తుంది. బీపీ, షుగర్.. ఇవి పెరిగి, బాధతో దాడి చేశారు. అందులో తప్పేముంది.?’ అంటూ, అప్పట్లో ఆ దాడిపై, అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.
కట్ చేస్తే, ఇప్పుడు వైసీపీ సొంత పత్రిక సాక్షికి చెందిన కార్యాలయానికి అమరావతి మహిళల ‘సెగ’ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగినట్లు, ఇక్కడ సాక్షి కార్యాలయంలో ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం గగ్గోలు పెడుతున్నారు.. దారుణం జరిగిపోయిందని ఆరోపిస్తూ.
అక్కడ, అభిమానస్తులకు బీపీ వచ్చినప్పుడు.. ఇక్కడ అభిమానస్తులైన మహిళలకు బీపీ రాకూడదా.? పైగా, ఇక్కడ మహిళలు, తమ ఆత్మగౌరవం కోసం నినదించారు, వైసీపీ కార్యాలయానికి నిరసన సెగ తగిలించారు.
నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్నట్లుగా తయారైంది పరిస్థితి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై ఆనాడు దాడికి వైసీపీ అధినాయకత్వం వ్యూహ రచన చేసి వుండకపోతే, ఈ రోజు పరిస్థితి ఇంకోలా వుండేది.
ఏదిఏమైనా, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం వుండకూడదు. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. అలానే, మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయాలకు అమ్ముడుపోయే మీడియా సంస్థలు, అమరావతిపై చేసిన జుగుప్సాకరమైన రాజకీయానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాయి.
సాక్షి యజమానికగా జగన్, ఆయన సతీమణి భారతి.. ఒక్క క్షమాపణ చెప్పి వుంటే, ‘వ్యభిచార ముద్ర వేసుకోవాల్సి వచ్చింది’ అనే ఆవేదన అమరావతి మహిళలో కాస్తయినా తగ్గి వుండేది.
