బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. గురువారం అర్ధరాత్రి 2.30 సమయంలో ముంబైలోని బాంద్రా లో ఉన్న తన నివాసంలోకి ఓ వ్యక్తి దొంగతనానికి చొరబడ్డాడు. ఇది గమనించిన సైఫ్ అడ్డుకోగా ఆయనపై దాడికి దిగాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవ్వడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనలో గాయపడిన సైఫ్ ను స్థానిక లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ ఒంటిపై ఆరు గాయాలు ఉన్నాయని.. వెన్నెముకపై రెండు తీవ్ర గాయాలు ఉన్నాయని శస్త్ర చికిత్స కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని లీలావతి ఆసుపత్రి సీఓఓ నీరజ్ ఉత్తమణి తెలిపారు. దీనిపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పటౌడీ వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ 2012 లో హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న సద్గురు శరన్ భవనంలో ఆయన తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గతేడాది టాలీవుడ్ కు పరిచయమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” లో “బైర” పాత్రలో మెప్పించారు.