Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే సినీ ఫక్కీలో జరిగిన దొంగతనం, కాల్పులు కలకలం రేపాయి. దోపీడీ దొంగల బీభత్సంతో ఆ ప్రాంతమంతా బీతావాహ వాతావరణం నెలకొంది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వచ్చిన బ్యాంకు సిబ్బందిపై దొంగలు కాల్పులు జరపడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని బీదర పట్టణంలో దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎంలో నగదు పెట్టేందుకు సిబ్బంది వచ్చారు. ఈక్రమంలో వారిని అనుసరించిన ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చి నగదు బయటకు తీసే సమయంలో కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
అయితే.. దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గమధ్యలో చనిపోయారు. దుండగులు నగదును తీసుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ సమీపంలోనే కాల్పులు జరగడం కలకలం రేపింది.