వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్ పెట్టడం, వీడియోలు తీసి, అధినాయకత్వానికి పంపించడం.. ఇదంతా అప్పట్లో నడిచిన నీఛమైన రాజకీయం.
సాక్షాత్తూ అప్పట్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజుకే ఆ కస్టోడియల్ టార్చర్ తప్పలేదు. ఎంపీ స్థాయి వ్యక్తికే అలా వుంటే, ఇక మిగతా రాజకీయ నాయకుల్ని వైసీపీ ఇంకెంత టార్చర్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, కూటమి హయాంలోనూ అరెస్టులు జరుగుతున్నా, వీటిల్లో కక్ష పూరిత చర్యలు మాత్రం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
తాజాగా, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి, కేసు వాపసు తీసుకునేలా ఒత్తిడి తీసుకొచ్చారట వల్లభనేని వంశీ.
నిజానికి, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి బెయిల్ రూపంలో వల్లభనేనికి కొంత ఊరట గతంలోనే లభించింది. బెయిల్ పొందాక, ఫిర్యాదు దారుని బెదిరించడం, కిడ్నాప్ చేయించడం, కేసుని తారు మారు చేసే ప్రయత్నం చేయడం.. తదితర ఆరోపణల నేపథ్యంలో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారన్నది తాజా సమాచారం.
ఈ విషయమై ఏపీ పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి వుంది. వైసీపీ హయాంలో, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు అత్యంత హేయమైన దాడికి తెగబడ్డాయి. ఆ దాడిని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో సమర్థించుకున్నారు. ‘అభిమానస్తులకు బీపీ వస్తే…’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
టీడీపీపై వైసీపీ శ్రేణుల దాడిలో, టీడీపీ కార్యాలయ సిబ్బంది పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
మొత్తమ్మీద, కేసు నుంచి తప్పించుకునేందుకు జిత్తులమారి వేషాలు వేసినా, ఆ వేషాలే వల్లభనేని వంశీని మరో కేసులో నిందితుడిగా మార్చడం.. ఇది కదా అసలు సిసలు దేవుడి స్క్రిప్ట్ అంటే. రాజకీయం అంటే, రౌడీయిజం.. అనే స్థాయికి రాజకీయాన్ని దిగజార్చేసిన నాయకుల్లో వల్లభనేని వంశీ కూడా ఒకరు.
2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓటమిని చవిచూశారు. అంతకు ముందు ఆయన టీడీపీ నుంచి గెలిచి, వైసీపీలోకి దూకేశారు. చంద్రబాబుపైనా, లోకేష్ పైనా.. అత్యంత జుగుప్సాకరమైన విమర్శలు చేసిన వైసీపీ నేతల్లో వల్లభనేని వంశీ ముందు వరుసలో వుంటారు.
వంశీ అరెస్టు పట్ల టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చాక ఇంతకాలానికి తమ కోరిక నెరవేరిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ తరహాలో అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే వల్లభనేని వంశీ అరెస్టు అయి వుండాల్సిందన్నది టీడీపీ శ్రేణుల భావన.
అయితే, వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ మారే ఆలోచనలో వున్నా, ఆయన్ని ఏ పార్టీ కూడా దగ్గరకు రానివ్వడంలేదు. రాజకీయంగా ఆయన దిగజారి వ్యవహరించిన తీరు అలాంటిది. రాజకీయాల్లో గోడ దూకుడు వ్యవహారాలు మామూలే అయినా, వల్లభనేని వంశీకి, అలా గోడ దూకేందుకు ఏ పార్టీ లేకపోవడం గమనార్హం.
ఇదిలా వుంటే, వల్లభనేని వంశీ అరెస్టు అక్రమం.. అంటూ షరామామూలుగానే వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.