ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కొన్నిరోజులుగా అధిక వర్షపాతరం నమోదవుతోంది. దీంతో రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కకుపోయాయి. జమునాముఖ్ జిల్లాలో చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో 500లకు పైగా కుటుంబాలు వసతి కోల్పోయి రైల్వే ట్రాక్ లపై ఉంటున్నాయి.
29 జిల్లాల్లో దాదాపు 8లక్షల మందికిపైగా ప్రజలు వరదలతో అవస్థలు పడుతున్నారు. ఐదారు రోజులుగా తమ పరిస్థితి ఇలానే ఉందని.. ఒకపూట తిండి, తాగేందుకు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్ షీట్లు వేసుకుని ఉంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదని బాధితులు వాపోతున్నారు.
అస్సాంలో భారీ వర్షాలకు కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బ తిన్నాయి. రైల్వే ట్రాక్స్ నీటమునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక దళాలు స్థానికులు కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.