చట్ట సభలంటే ప్రజల్లో ఏహ్యభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. చట్ట సభ విషయమై ప్రజల్లో క్రమంగా అసహనం కూడా పెరిగిపోతోంది. చట్ట సభలతో తమకేంటి సంబంధం.? అన్నట్టు ప్రజలూ ఓ నిర్వేదానికి వచ్చేస్తున్నారు. ఎన్నికలొస్తాయ్.. ఎవరో ఒకరు గెలుస్తారు, పరిపాలిస్తారు.. అంతే.!
గెలిచినోళ్ళు చట్ట సభల్లో ఏం మాట్లాడతారు.? ఓడినోళ్ళు చట్ట సభల్లో ఎలా వ్యవహరిస్తారు.? అన్న విషయమై జనాలకి పెద్దగా అంచనాలు లేకుండా పోతున్నాయి. అసలు చట్ట సభల్లో చర్చ ఎక్కడ జరుగుతోంది.? గత కొంతకాలంగా చట్ట సభలంటే, ప్రభుత్వ పెద్దల భజన కోసం ఉద్దేశించిన వ్యవహారంగా మారిపోయింది.
అధికారంలో వున్నోళ్ళు కొత్తగా చట్టాలేమైనా చెయ్యాలంటే, అవి ప్రజలకు అవసరమా.? కాదా.? అన్న ఆలోచనతో కాకుండా, తమకు ఎంతవరకు ప్రయోజనం అన్న కోణంలోనే పాలకులు వ్యవహరిస్తున్నారనే విమర్శ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయా చట్టాల రూపకల్పనలో ప్రభుత్వలో వున్నవారు వ్యవహరిస్తున్న తీరు, దానికి తోడు ప్రతిదానికీ అడ్డు తగిలే విపక్షాల వ్యవహారం.. వెరసి, చట్ట సభల లక్ష్యం నీరుగారిపోతోంది.
కేంద్రం కొత్తగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఆ తర్వాత రద్దవడం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడు రాజధానుల కోసం చేసిన చట్టాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం.. ఇవన్నీ ప్రభుత్వాల్ని నడుపుతున్నవారి ‘అజ్ఞానం’ కారణంగానేనన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
చట్ట సభల్లో చర్చ జరగాలి. మంది బలంతో అధికార పార్టీ ‘బుల్డోజ్’ చేసేస్తే, వ్యవహారం ఇలాగే వుంటుంది. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారంలో వున్నవారు ఆలోచించుకోవాలి. ప్రజల మెప్పు పొంది అధికారంలోకి ఎలా రావాలో విపక్షాలు ఆలోచించుకోవాలి. అలా సదుద్దేశ్యంతో రాజకీయ పార్టీలు ఆలోచనలు చేసినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది.
కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడూ సరైన చర్చ జరగలేదు.. వాటి రద్దు సమయంలో అయితే అసలు చర్చే జరగలేదు. మూడు రాజధానుల విషయమై రాష్ట్ర అసెంబ్లీలో సరైన చర్చ జరగలేదు.. రద్దు సందర్భంగానూ అదే పరిస్థితి.
ఒకవేళ కొత్త సాగు చట్టాలపై పార్లమెంటులో జరగాల్సిన స్థాయిలో చర్చ జరిగి వుంటే, ఆ చట్టాల్ని వెనక్కి తీసుకునే దుస్థితి మోడీ సర్కారుకి వచ్చి వుండేది కాదు. మూడు రాజధానుల వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కారు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించి వుంటే.. రాష్ట్ర ప్రజలూ మూడు రాజధానులకు ‘సై’ అనేవారే.
చాలా అంశాల్లో పాలకులు ‘సోయ’ కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందా.? అనే అనుమానం ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నారంటే.. వారి ఆవేదన అర్థం చేసుకోదగ్గదే మరి.