దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న తర్వాతనే మళ్లీ సీఎం పగ్గాలు తీసుకుంటానని చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో దాదాపు ఆరు నెలలు జైలుకెళ్లిన కేజ్రీవాల్.. మొన్ననే శుక్రవారం బయటకు వచ్చారు. రాగానే ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. కీలక ప్రకటన చేశారు. తాను నిర్ధోషిని అని నిరూపించుకునే వరకు సీఎం పదవిలో ఉండబోనని ప్రకటించారు. ఆప్ నుంచి త్వరలోనే కొత్త సీఎం ఎంపిక అవుతారని తెలిపారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆప్ ను టార్గెట్ చేసింది. ఆప్ నేతలు సత్యేంజర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు కేజ్రీవాల్. ఎన్డీయేలో లేని సీఎంలను పదవుల నుంచి దింపేయడమే బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందని.. ఇందులో భాగంగానే కర్నాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మీద కేసులు పెట్టిందని ఆరోపించారు కేజ్రీవాల్.
కేసులు పెట్టినంత మాత్రాన సీఎం పదవులకు రాజీనామాలు చేయొద్దని.. పోరాడాలని కోరారు. తాను జైలు నుంచి కూడా పరిపాలన చేశానని దానికి సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని.. కాకపోతే మహారాష్ట్రతో పాటు నవంబర్ లోనే నిర్వహించాలని కోరారు ఢిల్లీ సీఎం. అప్పుడు తన నిజాయితీ బయటపడుతుందన్నారు.
తాను నిర్దోషిని అని ప్రజలు భావిస్తే గెలిపిస్తారని.. లేదంటే ఓడిస్తారని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామాతో ఆ పార్టీ నుంచి ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.