సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ లేకుండా పోయింది తెలుగునాట.
ఇక, సీపీఐ నారాయణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కానీ, ఆయన తరచూ వార్తల్లో వుండేందుకు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. బిగ్ బాస్ పేరుతో అక్కినేని నాగార్జున మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా, చిరంజీవి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా.. అదేదో తనకు మాత్రమే సాధ్యమని విర్రవీగుతుంటారు నారాయణ.
చికెన్ నారాయణ, ఇడ్లీ నారాయణ.. ఇలా చాలా పేర్లున్నాయి సీపీఐ నారాయణకి.! కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు నారాయణ. అయితే, అదే నారాయణకి ఓ మహిళ నుంచి నిలదీత ఎదురైంది. అది అప్పట్లో ఓ సంచలనం.
‘చిరంజీవి వల్ల నా కొడుకు బతికాడు.. ఓ ప్రాణం నిలబెట్టారు చిరంజీవి. ఆయన మీద మీరెలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారు.?’ అని నారాయణని నిలదీసింది ఆ మహిళ. ‘రాజకీయాల్లో విమర్శలుంటాయి. కానీ, నేను హద్దులు దాటాను. తప్పు సరిదిద్దుకున్నాను..’ అని నారాయణ అప్పటికే తాను క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆ మహిళతో చెప్పారు.
చాలా కాలం తర్వాత చిరంజీవి తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణ పేరుని ప్రస్తావించలేదుగానీ, ఓ రాజకీయ నాయకుడు అవాకులు చెవాకులు పేలారంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం, సదరు మహిళ నిలదీయడం గురించి ప్రస్తావించడంతో.. విషయం నారాయణ మీదేనని అందరికీ అర్థమయ్యింది.
‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను నిర్వహిస్తున్నారు చిరంజీవి. కోవిడ్ కష్ట కాలంలో, ఆక్సిజన్ బ్యాంకుల్నీ చిరంజీవి నిర్వహించిన సంగతి తెలిసిందే. రక్త దానంతో వందలాది కాదు, వేలాది లక్షలాది ప్రాణాలు గడచిన కొన్నేళ్ళలో కాపాడబడ్డాయి. వేలాది మందికి చూపు దక్కింది. ఆక్సిజన్ బ్యాంకులు నిలబెట్టిన ప్రాణాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే.
ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, నటుడిగా అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నా.. చిరంజీవి మీద బురద చల్లడం అన్నది చాలా తేలికైపోయింది కొందరికి. ఎందుకంటే, చిరంజీవి ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందించరు. ‘వాళ్ళ పాపం వాళ్ళకే..’ అని వదిలేస్తుంటారు.
రోజులు మారాయ్. అడ్డగోలు విమర్శల తీవ్రత పెరిగింది.. ఆపై ట్రోలింగ్ తాకిడి కూడా చాలా దారుణంగా వుంది. సుతిమెత్తగా వ్యవహరిస్తే కుదరదిక్కడ. మెగా కాంపౌండ్ నుంచి కొన్ని విషయాలపై కౌంటర్ ఎటాక్, అంతే తీవ్రంగా వుండాల్సిందేనన్నది సగటు మెగాభిమానుల వాదన.
ఎవరి పాపాన వారు పోతారు.. అని చిరంజీవి బలంగా నమ్ముతారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అలాంటివారు చిమ్మే విషం.. చాలా నష్టాన్ని కలిగిస్తుందనీ. మెగాభిమానులు వాపోతున్నారు..