Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. పైరసీ సినిమాను ఇరకాటంలో పడేస్తోంది. సినిమా రిలీజైన రెండో రోజునే హెచ్ డీ ప్రింట్ లింక్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చిత్ర యూనిట్ ను విస్మయానికి గురి చేసింది. దీనిపై నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. ఇటువంటి ఘటనలను ఉపేక్షించమన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు.. తండేల్ సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ సైతం స్పందించారు. సినిమా లింక్ వాట్సప్, టెలిగ్రామ్ చానెల్స్ లో ఫార్వర్డ్ చేస్తున్నవారిపై కేసులు పెడుతున్నామని అన్నారు. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పైరసీ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని బన్నీ వాస్ అన్నారు.