శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. “ప్రతి కుటుంబంలో ఒక ఏఐ ఆధారిత సభ్యుడు ఉండేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మా ప్రభుత్వ సంకల్పం” అని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఓపెన్‌ఏఐ ప్రత్యక్ష సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంలో లోకేష్, తొలిదశలో ఏపీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపిటి సేవలను అందించే ప్రణాళికను వివరించారు. అదేవిధంగా, డేటా సెంటర్ హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఓపెన్‌ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు కూడా పరిశీలించాలని కోరారు. ప్రపంచంలోని 180కి పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న తమ సంస్థ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ కంపెనీలతో కలిసి ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్‌పై పనిచేస్తోందని ఓపెన్‌ఏఐ సీటీవో నారాయణన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో సమగ్ర చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.
చాట్‌జీపిటి ప్లస్, ఏపీఐలు, ఎంటర్‌ప్రైజ్ పరిష్కారాలు వంటి సేవల ద్వారాగత ఏడాది ఓపెన్‌ఏఐ సుమారు $3.5 బిలియన్ ఆదాయం ఆర్జించినట్లు, సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం $90 బిలియన్లకు చేరుకున్నట్లు సమాచారం.
