ఆంధ్రప్రదేశ్‌లో అజ్ఞాన రాజకీయం.. దీనికి ‘మందు’ లేదా.?

YSRCP-TDP-Faction-Politics-In-AP

అంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘అజ్ఞానం’ రాజ్యమేలుతోంది. దేశంలో మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి సోదాలు జరపడం కొత్తేమీ కాదు. ఈ మధ్యనే తమిళనాడులో ఐటీ సోదాలు జరిగాయి. అక్కడ దాదాపు 77 కోట్ల రూపాయల నగదు, బోల్డంత బంగారం దొరికింది. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ సహా, కొన్ని సినీ నిర్మాణ సంస్థలపై ఐటీ సోదాలు జరిగితే, ఆ సోదాల్లో బయటపడిన నగదు, బంగారం లెక్కలు.. అందర్నీ విస్మయానికి గురిచేశాయి.

అన్నట్టు, ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తోన్న ఐటీ సోదాల్లో దొరికిన డబ్బు కనీసం కోటి రూపాయలు కూడా లేదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌ అనే అధికారి వద్దనే 2 వేల కోట్ల రూపాయలు దొరికాయని అధికార వైఎస్సార్సీపీ నేతలు కొందరు ‘అజ్ఞానం’తో రాజకీయ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు మీద రాజకీయంగా వైసీపీ నేతలకు ‘మంట’ వుండొచ్చుగాక. ఐటీ సోదాల సందర్భంగా చంద్రబాబు బాగోతం బయటపడే అవకాశమూ వుండొచ్చుగాక. అది రానున్న రోజుల్లో తేలుతుంది. కానీ, ఈ దుష్ప్రచారమేంటి.?

దీని వల్ల చంద్రబాబుకి కలిగే నష్టమేమీ లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే లాభమూ ఏమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ పరువు బజార్న పడిపోతోంది. చంద్రబాబు అంత అవినీతిపరుడే అయితే, గడచిన ఎనిమిది నెలల్లో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం డైరెక్ట్‌గా ఎందుకు కేసులు నమోదు చేయలేదు.? బుర్రలో ’చటాక్‌ అంత ధమాక్‌’ వున్నోడికైనా ఈ డౌట్‌ రాక మానదు.

మరోపక్క, వైసీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేసేసరికి, టీడీపీ నేతలూ ‘తమకు ధమాక్‌ లేదు’ అని ప్రూవ్‌ చేసేసుకోవాలనుకున్నట్టున్నారు. ‘గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడిమేసుకున్న’ చందాన, టీడీపీ నేతలూ నానా యాగీ చేశారు. అది ఐటీ సోదాల వ్యవహారం. ఐటీ శాఖ, తమ సోదాలకు సంబంధించి ఆయా వ్యక్తులు లేదా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఆయా సంస్థలు లేదా వ్యక్తులు వాటికి లెక్కలు చెప్పాల్సి వుంటుంది.

సరే, చంద్రబాబు 2 లక్షల కోట్లు దోచేశారని వైసీపీ నేతలు విమర్శించొచ్చుగాక. అది రాజకీయం. ఆ రాజకీయమైనా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారా.? అంటే అదీ లేదు. అక్కడ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద దాదాపు 43 వేల కోట్ల రూపాయల అక్రమార్జన / అవినీతి అనే కోణంలో అభియోగాలు నమోదయ్యాయి. చంద్రబాబుని వెనకేసుకొచ్చి వైఎస్‌ జగన్‌ని విమర్శించినా, వైఎస్‌ జగన్‌ని సమర్థించి చంద్రాబుని వెనకేసుకొచ్చినా.. అంతకన్నా అజ్ఞానం ఇంకొకటుండదు. ఈ విషయంలో టీడీపీ – వైసీపీలకు సమానంగానే మార్కులు పడతాయ్‌. ఈ మాత్రందానికి తమ రాజకీయ అజ్ఞానాన్ని రెండు పార్టీల నేతలూ జనం ముందు పరిచేయడమెందుకు.? పొరుగు రాష్ట్రాలు మనల్ని చూసి నవ్వుకోవడానికా.?