ఎడా పెడా వైసీపీ కార్యకర్తలు అరెస్టవుతూ వస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదయ్యింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులూ వణుకుతున్నారు. వైసీపీ అధికారంలో వుండగా విర్రవీగిన కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. ఇప్పుడు క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు.
నిన్న మొన్నటిదాకా పరిస్థితి వేరు.! ‘అధికారంలోకి వచ్చి ఏం లాభం.? వైసీపీ నుంచి ఇంకా అదే దుష్ప్రచారం.. ఇంకా అదే జుగుప్సాకర రాజకీయం..’ అంటూ టీడీపీ శ్రేణులు, తమ అధినేత చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ వాపోవడం చూశాం.
నారా లోకేష్ రెడ్ బుక్ ఏమయ్యింది.? అని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నించిన పరిస్థితులు కనిపించాయి. క్రమంగా మార్పు వచ్చింది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కళ్యాణ్, హోంశాఖ తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారో, పోలీస్ శాఖలో కొందరి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారో.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయ్.
సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరమైన పదజాలం ఉపయోగించి, టీడీపీ – జనసేన – బీజేపీ నేతల కుటుంబాల్లోని మహిళలు, చిన్న పిల్లల్ని దూషించినవారిపై ఎడా పెడా కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు కూడా షురూ అవుతున్నాయి.
‘తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాజకీయాలకతీతంగా అరెస్టులుంటాయ్’ అనే సంకేతాలు షురూ అయ్యాయ్. ‘పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ మార్పు..’ అని టీడీపీ శ్రేణులే ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే టీడీపీ శ్రేణులు, మొన్న పవన్ కళ్యాణ్ హోంశాఖపై అసహనం వ్యక్తం చేస్తే, ఆయన మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
తాజాగా, వైసీపీ హయాంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీటేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ఈ మార్పు పేరు పవన్ కళ్యాణ్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోందిప్పుడు.! మార్పు మంచిదేగా.. ఆహ్వానించాల్సిందే.!