AP High Court: సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుపై హైకోర్టు స్పందించింది. 14రోజులు ఇచ్చిన అనుమతులను 10రోజులకు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఇవే ఆదేశాలిచ్చామని.. ప్రస్తుత సినిమాలకూ అవే ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు హైకోర్టులో పిల్ వేశారు. రెండు సినిమాల హీరోలకు సీఎం, డీసీఎం బంధువులు కాబట్టే టికెట్ ధరలు పెంచుకునేందుకు 14 రోజులు అనుమతిచ్చారన్నారు. గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ వేడుకకు వెళ్లొస్తూ ఇద్దరు యువకులు మరణించారని.. అర్ధరాత్రి ప్రీమియర్ ప్రదర్శనలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ‘శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తులు చనిపోయారు కాబట్టి శ్రీహరికోటలో ప్రయోగాలు ఆపేయాలా..? అలాగే ఉంది మీ అభ్యర్ధన’ అని పేర్కొంది. తగిన ఉత్తర్వులు ఇస్తామని విచారణ వాయిదా వేసింది. ఈక్రమంలో టికెట్ ధరల పెంపును 10రోజులుకు కుదించాలని ఆదేశాలిచ్చింది.