ఈ ఏడాది నెల్లూరు కోర్టులో జరిగిన ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ పీ.కే.మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ, మోసం, తప్పుడు పత్రాలు సృష్టి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ కీలకదశలో ఉండగా నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనానికి గురయ్యాయి. పత్రాలు సమీపంలోని కాలువలో లభ్యమవడం కలకలం రేపింది.
ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిగా లేదని సీబీఐతో విచారణ జరిపించాలని నెల్లూరు జిల్లా జడ్జి నివేదిక ఇచ్చారు. దీంతో ఈ పిల్ ను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. అప్పట్లో సీబీఐ డైరక్టర్, డీజీపీ, మంత్రి కాకాణికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కేసు సీబీఐకి అప్పగించినా తమకు అభ్యంతరం లేదంటూ ఏజీ గతంలోనే హైకోర్టుకు విన్నవించారు.