ఎరువుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విజిలెన్స్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఆగస్టు 23 నుంచి 31 వరకు జరిగిన తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమ నిల్వలు బయటపడ్డాయి.
మొత్తం 286 బృందాలు 598 దుకాణాలను పరిశీలించగా, రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.4.30 కోట్ల విలువైన 1,911 మెట్రిక్ టన్నుల ఎరువులను నిలిపివేశారు. మొత్తం 191 కేసులు నమోదు కాగా, 8 దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.
రైతులకు ఎక్కడా ఎరువులు, పురుగుమందుల కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులు ఆదేశించారు. రైతులను మోసం చేసే డీలర్లపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
