వైయస్సార్సీపి ఘోర పరాజయం పాలవడంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి విధేయత చూపిన అధికారుల్లో భయం మొదలైంది. తమను రిలీవ్, ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో వాళ్ల ప్లాన్లు వర్కౌట్ అయ్యేలా లేవు. వారి సొంత డిపార్ట్మెంట్ లకు పంపేయాలని అభ్యర్థన చేస్తున్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు నిరోధించాలంటూ గవర్నర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.
తన సొంత డిపార్ట్మెంట్ కి వెళతానంటూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి రామకృష్ణ ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తనని ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా గనుల శాఖ ఎండి వెంకట్ రెడ్డి అభ్యర్థిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎండి విజయ్ కుమార్ రెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఎండి చిలకల రాజేశ్వర్ రెడ్డి తమని రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. అమెరికా వెళ్లడానికి తనకు సెలవులు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసిన సిఐడి చీఫ్ సంజయ్ కి అత్యవసరంగా సీఎస్ జవహర్ రెడ్డి అనుమతి ఇచ్చారు.
తాజాగా అందిన ఆదేశాల నేపథ్యంలో సిఐడి చీఫ్ విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. రెవెన్యూ శాఖలో ఎలాంటి ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని ఇప్పటికే ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా రెవెన్యూ మంత్రి ఛాంబర్ లోని దస్త్రాలను, రికార్డులను జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచించారు.
మరోవైపు ఇన్నాళ్లు వైసీపీ కి కొమ్ము కాసిన పోలీసుల్లోనూ వణుకు మొదలైంది. అప్పట్లో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఎన్నికల ఫలితాల అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వీరితోపాటు పలు జిల్లాల ఎస్పీలు, డిఎస్పీలు, కమిషనర్లు తమను తమ స్వస్థలాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అయితే నిన్నటికి నిన్న టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ తనని వేధించిన జాషువాని వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. వీరితోపాటు వైసీపీ అరాచకాలకు వంత పాడిన ఏ పోలీస్ నీ విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. దీంతో పోలీసు అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.