పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు రేపు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. పీఆర్సీ సాధన సమితి నేతలను చర్చలకు ఆహ్వానించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని నేతలకు ఫోన్ చేసి సమస్యను సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని అన్నారు. అయితే, పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
మరోవైపు.. విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. గాంధీనగర్ లోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు హాజరై పీఆర్సీ జీవోలు రద్దు, ఇతర సమస్యలపై చర్చించారు.
ఉద్యోగ సంఘాల సమ్మెకు ఆర్టీసీ సిబ్బంది మద్దతు పలికారు. ఈ సమ్మెలో పాల్గొంటామని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత స్పష్టం చేశారు. సమావేశంలో నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.