పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రత్యేక విధానాలు రూపొందించాలని సూచించారు. చిన్నారుల్లో సృజనాత్మకత, మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలపై అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పిల్లల డిజిటల్ భద్రత, సున్నితమైన కంటెంట్ నియంత్రణ, చట్టపరమైన వ్యవస్థల విషయంలో ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. వయస్సు నిర్ధారణ కోసం డిజిలాకర్‌తో అనుసంధానమైన ఏజ్ టోకెన్ల వినియోగంపై కూడా పరిశీలన జరపాలని తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం కేంద్ర చట్ట పరిధిలోకి వచ్చే అంశాలపై సమగ్ర నివేదికను అందజేస్తామని చెప్పారు.
సోషల్ మీడియా ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’, ప్రతి ఏడాది రెండుసార్లు జరిగే మెగా పీటీఏ సమావేశాలు, అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కూడా ఈ అవగాహనను విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు, సున్నితమైన కంటెంట్ నియంత్రణకు అమలు చేస్తున్న విధానాలను వివిధ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు.
ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐజీ ఈగల్ మరియు సైబర్ క్రైమ్ ఇన్‌చార్జ్ ఆకే రవికృష్ణ, సైబర్ క్రైమ్ ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా, ఐ & పీఆర్ జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, డిజిటల్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ పి. జయరావు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒ. మధుసూదనరావు, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు హాజరయ్యారు. సోషల్ మీడియా సంస్థల నుంచి మెటా డైరెక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామినాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్‌చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి రామానుజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
పిల్లల ఆన్‌లైన్ భద్రత, మహిళల గౌరవం, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించబోతుందనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా స్పష్టమయ్యాయి.



