వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
రాజమహేంద్రవరంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల ఆధారంగా పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే అధికారికంగా జీవో విడుదల చేశారు. గోదావరి నదితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
ఇటీవల రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్వయంగా పడవలో ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పవిత్రమైన గోదావరిలో స్వచ్ఛమైన జలాల్లో స్నానం చేస్తున్న అనుభూతి కలగాలని, కాలుష్య సమస్యపై రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. వివిధ శాఖల కమిషనర్లు, ఇంజినీర్లు, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై గోదావరితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య మూలాలను గుర్తించనుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు తక్షణ చర్యలు చేపట్టి పనుల పురోగతిని సమీక్షించనుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు వెల్లడించారు.
