ఏపీలో కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. మొదటి నుంచీ ఈ జిల్లాకు దాదాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు, పార్టీల నుంచి డిమాండ్ ఉంది. ఈమేరకు ఆందోళనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని 13 జిల్లాలను ఇటివలే 26 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఉగాది నుంచి ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈక్రమంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు పలు ప్రాతిపదికల ప్రకారం పేర్లు నిర్ణయించారు. ఈక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. పలు డిమాండ్లు వచ్చినా కూడా కోనసీమ పేరునే ఖరారు చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో డిమాండ్లు ఎక్కువగా రావడంతో కోనసీమకు ముందు డా.బీఆర్.అంబేద్కర్ పేరును చేర్చాలని నిర్ణయించింది.