దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక భేటీ నిర్వహించారు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్‌ఎల్ (EVO) మేనేజింగ్ డైరెక్టర్ జోస్ మెల్లాడోతో సమావేశమై, గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వాహనాల రంగంలో ఏపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకునే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వాహనాల రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని పోర్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఇంజనీరింగ్ సాండ్‌బాక్స్‌లను వినియోగించి వినూత్న ప్రాజెక్టులకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ ఆధారిత టెర్మినల్ ట్రాక్టర్లను పైలట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. అలాగే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఆధారిత ఆఫ్-రోడ్ వాహనాల కోసం కో-పైలట్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసి, వాటి రీడిజైన్, ఆప్టిమైజేషన్ బాధ్యతలను ఎవో సంస్థ చేపట్టాలని కోరారు.
ఈ ప్రాజెక్టులకు అవసరమైన టెస్ట్ బెడ్స్, అనుమతులు, మౌలిక వసతులు ఏపీ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రోటోటైప్ అభివృద్ధి, ఇంజనీర్ల శిక్షణకు కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అవసరమైతే ఇండస్ట్రియల్ లేదా అకడమిక్ క్యాంపస్‌లలో ప్రత్యేక ఇంజనీరింగ్ సాండ్‌బాక్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ, సస్టెయినబుల్ మొబిలిటీ రంగాల్లో ఏపీకి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం ఉండనుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
