Piracy: సినీ పరిశ్రమను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న అంశం ‘పైరసీ’. ఎటువంటి పద్ధతుల్ని అవలంబించినా మోసగాళ్లు వేరే దారులు వెతుక్కుని మరీ సినిమాల్ని ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు, సినిమాలను కొనుక్కున్న వారికి నష్టాలు తప్పడంలేదు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లికి చెందిన యువ ఇంజినీర్ వినోద్ కుమార్ ‘పైరసీ సెక్యూర్డ్ బోర్డ్’ కనిపెట్టి సరికొత్త పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడున్న వాటర్ మార్క్ విధానానికి మించి ఈ టెక్నాలజీ అత్యాధునికమైనదని అంటున్నారు.
పైరసీ అడ్డుకునే క్రమంలో అమెరికా, జపాన్ వంటి దేశాలు తీసుకొచ్చిన పద్ధతులతో పోటీపడి వినోద్ కుమార్ కనిపెట్టిన టెక్నాలజీ పేటెంట్ హక్కులు దక్కించుకోవడం విశేషం. సాఫ్ట్ వేర్ టెక్నాలజీతో కాకుండా హార్డ్ వేర్ పద్ధతుల్లో వినోద్ కుమార్ పైరసీని అడ్డుకునే టెక్నాలజీ తీసుకొచ్చారు. దీంతో ప్రతి ధియేటర్లో ఈ టెక్నాలజీని అమర్చుకుంటే సెల్ ఫోన్ నుంచి ఎటువంటి అత్యాధునిక కెమెరా నుంచి కాపీ చేసినా చుట్టుపక్కల శబ్దాలు, తెల్లటి తెర తప్పితే సినిమా రికార్డ్ కావడం అసాధ్యమని చెప్తున్నారు వినోద్ కుమార్.
వినోద్ తీసుకొచ్చిన టెక్నాలజీని వివిధ దశల్లో పరీక్షలు జరిపిన అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ‘బెల్ కామ్ టెక్నాలజీ’ ఈ అధునాతన టెక్నాలజీని త్వరలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిని అన్నిదశల్లోనూ పరిక్షలు జరిపామని.. ఇదొక అద్భుతమని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పవన్ కల్యాణ్ పంజా సినిమాకు పనిచేసిన అనుభవం ఉన్న వినోద్ కుమార్ దాదాపు 8ఏళ్లు కష్టపడి ఈ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. ఈ టెక్నాలజీ అమర్చుకునేందుకు ధియేటర్లలో తెర ముందు, తెర వెనుక ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని.. మరి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
రెండు దశాబ్దాల క్రితం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సీడీల్లో పైరసీలు జరిగి సినిమాలకు భారీ నష్టం వాటిల్లేది. విస్తృత ప్రచారం అనంతరం ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగారు. అనంతరం వాటర్ మార్క్ ద్వారా పైరసీ ఎక్కడ జరిగిందో కనిపెట్టి చర్యలు తీసుకుంటున్నా.. సరికొత్త పద్ధతుల్లో పైరసీ చేస్తున్నారు. ఇటివల రామ్ చరణ్ గేమ్ చేంజర్ HD ప్రింట్ లోకల్ చానెల్స్ లో ప్రసారం చేయడం.. నాగచైతన్య తండేల్ ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రసారం చేయడం, సోషల్ మీడియాలో లింక్స్ రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో వినోద్ కుమార్ తీసుకొచ్చిన టెక్నాలజీ సినీ పరిశ్రమకు వరంలా మారుతుందని ఆశిద్దాం..!