ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున అయినా.. సర్వేలు చేయడం, చిటికె వేసినంత సులువైపోయింది.
అందుకే, కుప్పలు తెప్పలుగా సర్వేలు వెలుగు చూస్తున్నాయి. ఫలానా పార్టీ మీద మీ అభిప్రాయమేంటి.? అని ఎవరైనా ఓ సామాన్యుడిని అడిగితే, అతనూ ముదిరిపోయాడు.. ఒక్కో సర్వే సందర్భంగా ఒక్కోలా సమాధానమిస్తున్నాడు. అందుకే, శాంపిల్ సైజ్ పెరిగితేనే, రిజల్ట్ విషయమై ఓ స్పష్టతకు రావడానికి వీలుంటుంది.
అలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని కూడా కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ కోణంలో చేసిన ఓ ప్రైవేటు సర్వే ప్రకారం, ఆంధ్ర ప్రదెశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) ఘనవిజయం సాధించబోతోందని తేలింది. రాయలసీమకు చెందిన ఓ బృందం ఈ సర్వే నిర్వహించింది.
వృత్తి రీత్యా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా బెంగళూరు, చెన్నయ్, హైద్రాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న కొందరు స్నేహితులు ఓ బృందంగా ఏర్పడి, పోలింగ్‌కి జస్ట్ రెండు మూడు రోజుల ముందర నిర్వహించిన సర్వే ఇది. పోలింగ్ రోజున కూడా శాంపిల్స్ తీసుకున్నారట.. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తారట.
ఈ సర్వే ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే, కూటమి అభ్యర్థుల్లో దాదాపు 92 మందికి పది వేల కంటే ఎక్కువ మెజార్టీ రాబోతోందిట. కొంతమందికి ఐదు వేల కంటే ఎక్కువ, పది వేల ఓట్ల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ లభిస్తుందని సర్వేలో తేలిందని చెబుతున్నారు.
వైసీపీ చెబుతూ వస్తున్న సైలెంట్ ఓటింగ్ అనే మాట నిజమేననీ, ఆ సైలెంట్ ఓటింగ్ వైసీపీకి వ్యతిరేకంగా పడిందనీ, సాధారణంగా సైలెంట్ ఓటింగ్ అనేది అధికార పార్టీకి వ్యతిరేకంగానే పడుతుందనీ, అదే సర్వేలో తేలిందనీ చెబుతున్నారు.
వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యపై భిన్న వాదనలున్నాయి. ‘ఎడ్జ్’లో వైసీపీకి అన్నీ కలిసొస్తే, 50 సీట్లు రావొచ్చనీ, ఆ ఎడ్జ్ జారితే మాత్రం 25 సీట్ల లోపుకే వైసీపీ పరిమితమవుతుందనీ అంటున్నారు.
అదేంటీ, 175 సీట్లకు గాను మొత్తంగా 175 సీట్లూ వైసీపీనే కొల్లగొడుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు కదా.? అంటే, ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే నమ్మడంలేదు. 95 నుంచి 100 సీట్లతో వైసీపీ ఇంకోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే మాటకి వచ్చేశారు ప్రస్తుతం వైసీపీ మద్దతుదారులు.
అభ్యర్థుల్ని మార్చడం కొంపముంచిందనీ, అదే సమయంలో కొందరు సీనియర్లను కొనసాగించడం దెబ్బేసిందనీ.. వైసీపీ శ్రేణులే ఆయా నియోజకవర్గాల్లో అభిప్రాయపడుతుండడం గమనార్హం.