చంద్రబాబు హయాంలోనే పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే చంద్రబాబూ వున్నారు. ఆయన వల్లే తొక్కిసలాట.. అంటూ, నేటికీ వైసీపీ విమర్శిస్తూ వుంటుంది.
ఇప్పుడు, తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రాంతంలో అక్కడ చంద్రబాబు ఈసారి లేరు. కానీ, అధికారంలో వున్నది చంద్రబాబే. ఈ తరహా తొక్కిసలాటలు నివారించదగ్గవే.! సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తే.. ఇలాంటి తొక్కిసలాటలు లేకుండా చేయగలం. కానీ, చిన్న చిన్న పొరపాట్లు, ప్రాణ నష్టాలకు తావిస్తుంటాయ్.
చంద్రబాబు అధికారంలోకి వస్తూనే, వెంకన్న లడ్డూ వ్యవహారం సంచలనంగా మారింది. స్వయంగా చంద్రబాబే, లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, దేశమంతా తిరుమల వైపు గట్టిగా చూసేలా చేశారు. మరి, ఇప్పుడు ఈ దుర్ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది కదా.?
ఇంకోసారి ఈ తరహా ఘటనలు జరగకూడదంటే, ఏపీ సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. టీటీడీ బోర్డులో ప్రక్షాళన జరగాలి. పోలీస్ వ్యవస్థలోనూ ప్రక్షాళన జరగాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
‘టీటీడీ బోర్డు నిర్లక్ష్యం.. పోలీసు శాఖలో కొందరు అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది..’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా జరిగిన ఘటనపై సీరియస్‌గా వున్నారనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోపక్క, సీఎం చంద్రబాబు.. అధికారులపై చర్యలకు ఆదేశించడం కూడా జరిగింది.
సామాన్య భక్తుల పట్ల చిన్న చూపే అన్ని అనర్థాలకూ కారణమన్నది నిర్వివాదాంశం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన.. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం వచ్చే సామాన్య భక్తులకు టోకెన్ల పద్ధతి పెట్టడం, అదే వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు వచ్చే అవకాశం వుండడం.. ఈ క్రమంలోనే టోకెన్ల కోసం భక్తులు ఎగబడే పరిస్థితి వచ్చింది.
దాంతో, సామాన్య భక్తులంతా అసలు తిరుమల కొండపై వీఐపీలకు పనేంటి.? దేవుడి ముందర వీఐపీలు.. సామాన్యులు.. అనే తేడాలెందుకు.? అని నినదిస్తున్నారు. సరైన నిర్ణయం ఈ సమయంలో చంద్రబాబు తీసుకోవాల్సిందే. నిర్ణయం కఠినమైనదైనా, ఆ నిర్ణయం సామాన్యులకు అనుకూలంగా వుంటేనే, టీటీడీ ప్రతిష్ట నిలబడుతుంది.