ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించే ఇదంతా.
గడచిన ఏడాది కాలంలో అమరావతిలో రాజధానికి సంబంధించిన కార్యకలాపాలు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయి. ఓ వైపు ప్రభుత్వం తరఫున యాక్టివిటీ, ఇంకో వైపు ప్రైవేటు స్థలాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర్నుంచి, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం.. వెరసి, గడచిన ఏడాదిగా అమరావతిలో సందడి వాతావరణం కనిపిస్తోంది.
రానున్న రోజుల్లో ఈ యాక్టివిటీ మరింత పెరగనుంది. గతంలో వేసిన పునాదులపైన భవనాల్ని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ లభించిన దరిమిలా, అత్యంత వేగంగా ఆయా భవనాల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం వుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2028 చివరి నాటికి, అమరావతికి రాజధాని రూపు పూర్తిస్థాయిలో వస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వ తాజా అంచనా. అయితే, అంతకన్నా ముందే, రాజధాని అమరావతి పనులు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారట.
గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల నేపథ్యంలో (తాత్కాలిక ప్రస్తావన), ఈసారి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధాని నిర్మాణ పనులు నడుస్తున్నాయి. అదే సమయంలో, మంత్రి నారా లోకేష్ కూడా ఇకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారట రాజధానిపై.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో నారాయణ, లోకేష్.. రాజధాని పనుల్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాల్సిన స్థాయిలో రాజధాని పనుల్ని ముందుకు తీసుకెళతారని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం, అమరావతి నిర్మాణం ఎంత వేగంగా కొలిక్కి వస్తే, ప్రభుత్వానికి అంత అడ్వాంటేజ్.. అంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ప్రతిసారీ తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొడుతున్నారట.
