ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (జూలై 26) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ కు బయలుదేరుతున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ చేరుకోనున్నారు. అక్కడ ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బ్రాండ్ ఎపి ప్రచారం, పెట్టుబడుల సాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చిన తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. తొలి రోజు సింగపూర్‌లోని సౌత్ ఈస్ట్ ఏషియా తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశాన్ని AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ సదస్సు జరుగనుంది.
పలుదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఏపీ యువతకు సహాయం చేయడం, తెలుగువారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మారుస్తూ ప్రణాళికలు రూపొందించడంపై సమావేశాల్లో చర్చించనున్నారు. ‘జీరో పావర్టీ – P4’ కార్యక్రమంలో తెలుగువారి భాగస్వామ్యం కోసం ముఖ్యమంత్రి పిలుపునివ్వనున్నారు. అలాగే ఎగుమతులు పెంచడం, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాలు, పోర్టులు, లాజిస్టిక్ కేంద్రాల అభివృద్ధిపై పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి. నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
