తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాలు వినియోగించిన ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంటనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధి తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు.
గత ప్రభుత్వంలో ప్రసాదం తయారీలో జరిగిన తప్పిదాలపై ఈరోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయంపై భక్తులు ఆందోళనతో ఉన్నారని, వారి విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
దేవుడి ఫోటోలను తొలగించే ప్రయత్నం.. కేంద్ర మంత్రి తీవ్ర ఆరోపణలు
తిరుమల లడ్డూ వ్యవహారం పై ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లాజే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల కు చెందిన పాఠశాలలు, కళాశాలల్లో పద్మావతి అమ్మవారు, శ్రీవారి ఫోటోలను తొలగించాలని, హిందుయేతర గుర్తులను తిరుమల కొండపై ఏర్పాటు చేయాలని జగన్ అండ్ కో ప్రయత్నించిందని ఆమె వ్యాఖ్యానించారు. అన్యమతస్తులను గత ప్రభుత్వం బోర్డు చైర్మన్ గా నియమించిందని, జంతువుల కొవ్వును పవిత్రమైన ప్రసాదంలో కలిపిందని అన్నారు. ఈ మేరకు ఆమె “ఎక్స్” లో పోస్ట్ చేశారు.