దేవుడి స్క్రిప్ట్ అనాలా.? లేక కూటమి ప్రభుత్వ వ్యూహం అనాలా? పదకొండో నెలలో, పదకొండో తేదీన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టడమేంటి.? పైగా, ఇవి బడ్జెట్ సమావేశాలు కూడా. మరి, పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళతారా.? వెళ్ళరా.?
151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికార పీఠమెక్కినప్పుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 23 నెంబర్ చుట్టూ ఆడిన పొలిటికల్ డ్రామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులో సగం కూడా కాని 11 సంఖ్యకి పడిపోయిందిప్పుడు వైఎస్సార్సీపీ.
నిజానికి, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గతంలోనే జరగాల్సి వున్నా, వైసీపీ మిగిల్చిపోయిన అప్పుల కుంపటి నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం (టీడీపీ – బీజేపీ – జనసేన) ఆచి తూచి వ్యవహరించాల్సి వచ్చింది.
ఎక్కడెక్కడ ఎలాంటి అప్పులు వున్నాయో తెలియదు.. ఏ సంక్షేమ పథకానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలో అర్థం కాదు.. ఇంతటి గందరగోళ పరిస్థితిని మిగిల్చిపోయింది వైసీపీ.! గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో నొక్కిన బటన్లు, రాష్ట్ర ప్రజలకు మిగిల్చిన కష్టాలివి.
కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు గెలుచుకున్న వైసీపీ, అసెంబ్లీ మొహం చూడటానికి ఇష్టపడటంలేదు. గతంలో సమావేశాలు వేరు.. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వేరు. ఇవి బడ్జెట్ సమావేశాలు కావడంతో, వైసీపీ తప్పక ఈ సమావేశాలకు హాజరు కావాల్సి వుంది.
అయితే, అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని చూసి ఓర్చుకోవడం కష్టమే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. ‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం..’ అని బీరాలు పలికిన ఒకప్పటి వైసీపీ మంత్రులెవరూ ఇప్పుడు గెలిచింది లేరు.. ఆ గేటు దాటి లోపలికి వెళ్ళే పరిస్థితీ లేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీకి వెళ్ళే విషయమై వైసీపీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల నుంచి పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవి ఎందుకు.? అనే నిలదీతలు షురూ అయ్యాయట.