ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టి ఆకర్షించింది ఏపీ మాత్రమే. ‘ వై నాట్ 175’ అని నినాదంతో వైఎస్సార్ సీపీ.. ‘సూపర్ సిక్స్’ ఫార్ములా తో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు. వారెవరో చూద్దాం.
చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 1989 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వరుసగా ఎనిమిదో సారి చంద్రబాబు అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. పోటీ చేసిన అన్నిసార్లు ఆయనే అఖండ విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన రెండింటిలోనూ ఓటమిపాలయ్యారు. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి తన ప్రసంగాలతో ఓటర్ల మనసును గెలుచుకున్నారు. ఈసారి పిఠాపురంలో గెలుపు అవకాశాలు ఆయనకే ఎక్కువ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో వెళ్లడైంది.
నారా లోకేష్
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరసగా రెండోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి అదే నియోజకవర్గ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014 నుంచి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 1,24, 576 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆర్కే రోజా
మంత్రి ఆర్కే రోజా 2014 నుంచి నగరి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు పై, 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు భాను ప్రకాష్ నాయుడు పై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆమె భాను ప్రకాష్ తో పోటీ పడుతున్నారు.
