ఇదో కొత్త పంచాయితీ.! స్వర్గీయ నందమూరి తారక రామారావు.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరి మధ్యా ఇప్పుడు వారసత్వ పంచాయితీ తెరపైకొచ్చింది. ఎవరి వారసులు గొప్ప.? అక్కినేనిని ఆయన వారసులు బాగా చూసుకున్నారా.? ఎన్టీయార్‌ని ఆయన వారసులు బాగా చూసుకున్నారా.?
ఒక్కటి మాత్రం నిజం.! చివరి వరకూ అక్కినేని నాగేశ్వరరావు ఆనందంగానే వున్నారు. నందమూరి తారక రామారవు అలా కాదు. తన కుటుంబమే తనను ఒంటరిని చేసిందంటూ మానసిక క్షోభను అనుభవించారు. ఇక్కడే విషయం అర్థమయిపోతుంది.. ఎవరి జీవితం కడవరకు ఘనంగా సాగిందో.!
సరే, స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళారు.. అక్కినేనికి రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి.. ఎన్టీయార్ రాజకీయంగా కుటుంబ సభ్యులతో వెన్నుపోటు పొడిపించుకోవాల్సి వచ్చిందన్నది వేరే వాదన.
అసలు ఈ పంచాయితీ ఎందుకు తెరపైకొచ్చిందంటే, నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘అక్కడ ప్రేమ లేదు.. ఇక్కడ ప్రేమ వుంది..’ అనడమే. ‘ఆయన తన సొంత పిల్లల కంటే నన్నే బాగా చూసుకున్నారు..’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు గురించీ, ఆయన వారసుల గురించీ నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ఔన్లే, మీ నాన్నకు చివరి రోజుల్లో తిండి కూడా పెట్టలేదు మీరు. అంతే కాదు, బావ పంచన చేరి.. తండ్రికి ద్రోహం చేశారు. చివరి రోజుల్లో ఎన్టీయార్ అనుభవించిన మానసిక క్షోభకి మీరే కారణం.! ఈ విషయంలో మీకంటే గొప్పవారు ఎవరుంటారు.?’ అని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు.
అక్కినేని ఇంట ప్రేమ వుంది.. నందమూరి ఇంట్లో ప్రేమ లేదు, రాజకీయం తప్ప.. అన్నది అక్కినేని అభిమానుల ఆరోపణ. ‘పొరపాట మాట దొర్లింది’ అని చెప్పాల్సిన బాలకృష్ణ, ‘తొక్కినేని’ వివాదంపై, ‘వారసత్వ పంచాయితీ’ని తెరపైకి తెచ్చారు. అది బూమరాంగ్ అవుతోంది.