విశాఖ ఉక్కు కంపెనీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే స్టీల్ కంపెనీని ప్రైవేటీకరణ చేసేది లేదని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాకుండా కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలకు కేంద్రం సహకరిస్తోందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.11440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అంతే కాకుండా మరో గుడ్ న్యూస్ కూడా చెప్పిందని లోకేష్ వివరించారు. కేంద్రం ఆదేశాలతో ఐరన్‌ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఏడాది ఆగస్టు నుంచే మూడో బ్లాస్ట్ ఫర్నేసను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఒప్పందాన్ని 2027 నాటికి అమలు చేయబోతున్నారు. స్టీల్ కంపెనీ రూ.38 వేల 965 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టి దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర పెద్దలకు ఈ విషయాన్ని వివరిస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రిని ఒప్పించి స్టీల్ కంపెనీకి నిధులు సాధించారని కూటమి చెబుతోంది. కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సాయం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కుమారస్వామి. ఇప్పటికే రైల్వే జోన్‌కి సంబంధించి స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా.. ఇప్పుడు ఐరన్ ఓర్ కు సంబంధించిన హామీ కూడా ఇచ్చారు.
