ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరైన నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లీడ్ రోల్స్ లో వచ్చిన చిత్రం అన్ని మంచి శకునములే. ఈరోజే విడుదలైన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దాం.
కథ:
ఆర్య, రిషి పుట్టినప్పుడు పొరపాటున ఒకరి కుటుంబంలోంచి మరొక కుటుంబంలోకి మార్పిడి చేయబడతారు. అయితే వాళ్ళ పెద్దలకు ఆస్తి తగాదాలు ఉంటాయి. ఆర్య, రిషి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆ తగాదాలు, గొడవలు మరింత ముదురుతాయి.
ఇక ఈ కుటుంబాలు ఒక్కటి ఎలా అయ్యాయి. ఆర్య, రిషిల మధ్య అనుబంధం ఎలా పెరిగి పెద్దయింది అన్నది చిత్ర కథాంశం.
నటీనటులు:
తన కెరీర్ లో ఎక్కువగా ఫీల్ గుడ్ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ కోవలోకే చెందుతుంది అన్ని మంచి శకునములే. సినిమా సినిమాకూ తన నటనలో మెరుగుదల కనిపిస్తోంది. న్యాచురల్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు సంతోష్ శోభన్.
మాళవిక నాయర్ ఎంత టాలెంటెడ్ నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో కూడా మాళవిక చక్కగా నటించింది. ముఖ్యంగా ఇద్దరి కెమిస్ట్రీ చక్కగా ఉంది.
వీరికి తోడు సపోర్టింగ్ క్యాస్ట్ ఈ చిత్రానికి చక్కగా కుదిరింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమిలతో పాటు పలువురు నటించారు. వీరి వల్ల చిత్రానికి నిండుతనం వచ్చింది. ఇక వెన్నెల కిషోర్, గౌతమిలు ప్రముఖ పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం:
ఫీల్ గుడ్ చిత్రాలతో పేరు తెచ్చుకుంది నందిని రెడ్డి. మరోసారి అదే జోనర్ లో చిత్రాన్ని అటెంప్ట్ చేసింది. అయితే ఈసారి కథాకథనాల సంగతి పక్కనపెడితే చాలా నెమ్మదిగా నడిచే చిత్రాన్ని అటెంప్ట్ చేసింది నందిని రెడ్డి. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయి. పలు కామెడీ, ఎమోషనల్ సీన్స్ పక్కనపెడితే చిత్రమంతా స్లో గానే నడుస్తుంది.
మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా నిరాశపరిచాడు సంగీత దర్శకుడు.
సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్:
- క్యాస్ట్ అండ్ పెర్ఫార్మన్స్
- ఎమోషనల్ సీన్స్
- కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- స్లో నరేషన్
- కొన్నిసార్లు బోరింగ్ గా అనిపించడం
- మ్యూజిక్
చివరిగా:
చాలా నెమ్మదిగా నడిచే అన్ని మంచి శకునములే ప్రేక్షకులను ఆదరణ చూరగొనడం కొంచెం కష్టమే. ఈ చిత్రంలో కొన్ని ఎమోషనల్ సీన్స్, కామెడీ సన్నివేశాలు పక్కనపెడితే పెద్దగా చెప్పుకోవడానికంటూ ఏం లేదు. చాలా కొద్దిమంది వర్గాలకు మాత్రమే ఈ చిత్రం నచ్చే అవకాశముంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5