ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. నిజానికి, ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకుల్ని ప్రకటించారు గనుక, ర్యాంకుల్లో డొల్లతనాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.? అన్నది ఓ చర్చ.
అసలు ఈ ర్యాంకులేంటి.? వీటి వల్ల రాష్ట్రాలకు కలిగే అదనపు ప్రయోజనమేంటి.? మళ్ళీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేటగిరీలో రాష్ట్రాలకు ర్యాంకులు దక్కడం షురూ అయ్యింది.
చంద్రబాబు హయాంలో ఈ ర్యాంకుల గురించి టీడీపీ గొప్పగా చెప్పుకుంది. అప్పట్లో వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా ఈ ర్యాంకులపై చేసిన వెటకారం అంతా ఇంతా కాదు. ఇప్పుడేమో అదే వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా, ‘ఈ ర్యాంకులు చాలా చాలా గొప్పవి’ అంటుండడం గమనార్హం.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈ ర్యాంకులేంటో నాకు అర్థం కావడంలేదు..’ అని సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన, ఆయన టీమ్.. ‘మాకు ఫస్ట్ ర్యాంక్..’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
కేంద్రం, రాష్ట్రాల విషయంలో తన బాధ్యతను విస్మరించింది. పూటకో కొత్త పదాన్ని తెరపైకి తెస్తూ, రాష్ట్రాల్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. అలాంటి మాటల్లో ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కొన్నాళ్ళ క్రితం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో దేశంలో ఎన్ని స్మార్ట్ సిటీలు వచ్చినట్టు.?
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అంతే.! అప్పుడు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నా, ఇప్పుడు వైఎస్ జగన్ గొప్పలు చెప్పుకున్నా.. అవి వారి పబ్లిసిటీ స్టంట్లు, వాళ్ళని తాత్కాలికంగా ఆనందింపజేసేందుకు కేంద్రం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే.!