ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విక్రయానికి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై టికెట్ ధరపై సేవా రుసుమును 2 శాతానికి మించకూడదని నిర్దేశించింది. ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సర్వీస్ ప్రోవైడర్ ను నియమించి, నిర్వహనను ఏపీ ఫిలిం, టెలివిజన్, ధియేటర్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కు అప్పగించింది. ఈ సంస్థే నోడల్ ఏజెన్సీగా ఉంటుందని కూడా ప్రకటించింది.
ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తున్న సంస్థలు, సినిమా ధియేటర్లు ఆ విధానాన్ని కొనసాగించుకోవచ్చని.. నోడల్ ఏజెన్సీ నియమించిన సర్వీసు ప్రొవైడర్ ద్వారానే విక్రయాలు జరపాలని పేర్కొంది. ఈమేరకు ఏపీలోని సినిమా ధియేటర్లన్నీ ఏపీ ఫిలిం, టెలివిజన్, ధియేటర్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీసు ప్రొవైడర్ తో లింక్ అయ్యేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలు ధియేటర్ల యాజమాన్యాలే సమకూర్చుకోవాలని తెలిపింది.