ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఎదగడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రేపు విజయవాడ నోవాటెల్ హోటల్‌లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ డ్రైవ్‌లో 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు హాజరుకానున్నారు.
భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్న సమయంలో, ఏపీ ఈ విప్లవానికి కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతోంది. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రం గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థకు మానవ వనరుల కేంద్రంగా ఎదగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ, ఇన్‌స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వంటి అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రోగ్రామ్ క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న వర్క్‌ఫోర్స్ తయారుచేయడానికి దోహదం చేయనుంది.
2030 నాటికి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో మూడు కీలక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. సోలార్, విండ్ పరిశ్రమల నిపుణులు, పాలసీ మేకర్లు, శిక్షణ సంస్థలు కలిసి పరిశ్రమలకు అవసరమైన వర్క్‌ఫోర్స్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తారు. అదనంగా ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ప్రారంభించనున్నారు.
