అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి గిన్నిస్ రికార్డులు సాధించింది. ఈ కారిడార్‌లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో వానవోలు–వంకరకుంట–ఓదులపల్లె సెక్షన్ (ప్యాకేజ్–2,3)లో జరిగిన పనులు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయి.
ఈ నెల 6వ తేదీ ఉదయం 10.07 గంటల నుంచి 11వ తేదీ ఉదయం వరకు నిరంతరంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగాయి. కేవలం ఆరు రోజుల్లోనే 52 కిలోమీటర్ల పొడవున (మొత్తం 156 లేన్ కిలోమీటర్లు) కాంక్రీట్ రోడ్డు నిర్మించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే రోజులో 28.896 లేన్ కిలోమీటర్ల మేర రోడ్ పేవింగ్ చేసి రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ రెండు గిన్నిస్ రికార్డులు సాధించడం గమనార్హం. తాజా విజయంతో బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో మొత్తం నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి.
రోడ్డు నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును అత్యంత వేగంగా, పూర్తి నాణ్యతతో వినియోగించారు. 70 టిప్పర్లు, ఐదు మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లతో నిరంతరంగా పనులు సాగాయి. క్వాలిటీ ప్రమాణాల్లో ఏ మాత్రం రాజీ పడకుండా పనులు పూర్తిచేయడం నేషనల్ హైవే అథారిటీ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.
ఈ అసాధారణ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టిన నేషనల్ హైవే అథారిటీ, రాష్ట్ర అధికారులు, అలాగే రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థను ఆయన అభినందించారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన మిగిలిన పనులను కూడా ఇదే స్ఫూర్తితో, వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ ఘనత మరోసారి నిరూపించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.




