ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం మెలేసి, తొడకొట్టాడంటోంది వైసీపీ.! కాదు కాదు, మంత్రి అంబటి రాంబాబే రెచ్చగొట్టాడంటోంది టీడీపీ.!
తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ చిత్రమైన వైఖరి చాలాకాలంగా కనిపిస్తోంది. అధికార పార్టీ ఏం చూపించాలనుకుంటే, అదే రాష్ట్ర ప్రజలకు చూపిస్తోంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. అధికార పార్టీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఈ ప్రసార హక్కులుంటాయ్.! అదీ అసలు సంగతి.
బాలయ్య మీసం తిప్పి, తొడ కొట్టిన వీడియోలు అయితే ఇంకా విడుదల కాలేదు.! కానీ, గత కొన్నాళ్ళుగా.. అంటే, వైసీపీ హయాంలో, వైసీపీ శాసనసభ్యులు చేస్తున్న వికృత చేష్టల్ని, మాట్లాడుతున్న బూతుల్ని లైవల్‌లో తిలకిస్తూనే వున్నాం.
తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, మెంటలోడు.. అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు, మెంటల్ సర్టిఫికెట్ బాలయ్యకి వుందనీ చెప్పారు. గన్ను తీసుకొచ్చి అందర్నీ కాల్చేస్తే ఎలా అధ్యక్షా.? ఆయన్ని ఆసుపత్రికి పంపండి, అసెంబ్లీకి మాత్రం రానీయొద్దు.. అంటూ మధుసూధన్ రెడ్డి చిత్ర విచిత్రమైన హావభావాలు పండించారు.
విపక్షాలు మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం సరిగ్గా దొరకడంలేదన్నది నిర్వివాదాంశం. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా, ఎస్కేప్ మోడ్‌నే ఎంచుకుంటోంది. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ కూడా అంతే.! వెరసి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రజల్లో అసహస్యం పెరిగిపోతోంది.
అసహ్యం.. అనే మాట ప్రస్తావించాలంటేనే, అత్యంత అసహ్యకరంగా వుంటోంది. ప్రజాస్వామ్యంలో ఇది అస్సలు ఇలా జరగకూడదు. కానీ, జరుగుతోంది. కారణమేంటి.? సభా నిర్వహణ ఎందుకు ఇంత దారుణంగా జరుగుతోంది.? ఎన్నాళ్ళిలా.? మారాల్సింది ప్రజలే.! ఎవర్ని చట్ట సభలకు పంపుతున్నామన్న సోయ ప్రజలకు లేకపోతే, ఇలాగే వుంటుంది మరి.!
అన్నట్టు, తాజాగా బాలయ్య నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఈల వేసి గోల చేశారు.! దాంతో, అధికార పార్టీ సహజంగానే మరింత రెచ్చిపోయింది.