ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఉండవల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖలకు చెందిన అధికారులు పలు కార్యక్రమాల పురోగతిని మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మంత్రి లోకేష్, అడ్మిషన్లు పెంచేందుకు వినూత్న చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, జులై మూడో వారంలో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.
ఉన్నత విద్యాశాఖ సమీక్షలో భాగంగా ఎంసెట్, పాలిసెట్, ఆర్‌సెట్ సహా రాష్ట్రంలో నిర్వహించే అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షల నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ స్థాయి, ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తేదీలు ఖరారు చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపుపై కూడా మంత్రి చర్చించారు. మెకానికల్, సివిల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని అధికారులు వివరించగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. రాష్ట్రంలో ఉన్న 254 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 1.88 లక్షల సీట్ల భర్తీకి సంబంధించి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో జరుగుతున్న చర్చల పురోగతిని మంత్రి సమీక్షించారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర యువతకు మరిన్ని శిక్షణ అవకాశాలు లభించడంతో పాటు ఎన్‌సీసీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
